రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త

SMTV Desk 2019-06-01 12:19:31  modi, former

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిన్న తొలిసారి సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘కిసాన్ సమ్మాన్ యోజన’ పథకానికి సంబంధించి మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం ద్వారా దేశంలోని రైతులందరికీ పెట్టుబడి సాయం అందించనున్నారు. ఇప్పటిదాకా 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తుండగా తాజాగా ఆ నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పింఛన్ పథకం, వ్యాపారులకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా 14.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6 వేలను మూడు దఫాలుగా అందించనున్నారు. ఈ పథకం అమలుకు ఏటా రూ.87 వేల కోట్లు వ్యయం కానుంది. పీఎం కిసాన్ యోజనతో పాటు చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చేలా పింఛన్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రూ.10 వేల కోట్ల పింఛన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.