టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఎక్కడ?.....సైబరాబాద్ క్రైం పోలీసులు!

SMTV Desk 2019-05-31 13:55:56  raviprakash

సీనియర్‌ పాత్రికేయుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కోసం సైబరాబాద్‌ క్రైం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సంస్థలో వాటాల వివాదంలో ఆయనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి విచారణకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు నోటీసులు అందించిన పోలీసులు, ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసే దిశగా వేట మొదలు పెట్టారు.

ముఖ్యంగా ఫోర్జరీ కేసులో తొలుత 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. వాటికి స్పందించక పోవడంతో 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయనా స్పందించ లేదు. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఓ వీడియో సందేశాన్ని మాత్రం రవిప్రకాశ్ విడుదల చేశారు.

ఈ క్రమంలో రవిప్రకాశ్ ఏపీలోని ఓ రిసార్ట్స్‌లో తలదాచుకుంటున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడి నుంచి బెంగళూరు, తర్వాత గుజరాత్‌, ఆ తర్వాత మళ్లీ బెంగళూరు వెళ్లినట్లు సమాచారం ఉండడంతో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌ న్యాయమూర్తి కొట్టేయడంతో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు రావాల్సి ఉంది. కాగా, ఇదే కేసులో సహనిందితుడైన సినీ హీరో శివాజీ కోసం కూడా సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.