వేసవి సెలవులు ముగియనుండడంతో... తిరుమలకు పోటెత్తిన భక్తులు!

SMTV Desk 2019-05-31 13:10:41  tirumala

వేసవి సెలవులు ముగింపు దశకు చేరడం, వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్తజనసంద్రంగా మారాయి. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, క్యూలైన్ వెలుపలికి వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతుందని, భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఇక నడకదారి భక్తులకు, టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. అద్దె గదులు లభించక భక్తులు ఆరుబయటే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎండ అధికంగా ఉండటంతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు.