ఆల్ రౌండర్ ప్రతిభతో అదరకొట్టిన ఇంగ్లాండ్

SMTV Desk 2019-05-31 12:26:44  eng land, South africa

ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెన్‌స్టోక్స్ ఆల్‌రౌండ్‌షోతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 39.5 ఓవర్లలో కేవలం 207 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు ఇంగ్లండ్ బౌలర్లు ప్రారంభం నుంచే కట్టడి చేశారు. ఓపెనర్ హాషిం ఆమ్లా13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన ఐడెన్ మార్‌క్రామ్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన మార్‌క్రామ్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కొద్ది సేపటికే కెప్టెన్ డుప్లెసిస్ కూడా వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ క్వింటన్ డికాక్ పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ 74 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసి ఫ్లంకెట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు డుమినీ నిరాశ పరిచాడు. డుమినీ 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే డ్వేన్ పెట్రియాస్ కూడా వెనుదిరిగాడు. పెట్రియాస్ ఒక పరుగు మాత్రమే చేశాడు. కాగా, సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నా డుసెన్ మాత్రం పోరాటం కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ అలరించాడు. ఫెలుక్‌వాయో కూడా కాస్త బాగానే ఆడాడు. దూకుడుగా ఆడిన ఫెలుక్‌వాయో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 పరుగులు చేశాడు. మరోవైపు డుసెన్ 61 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసి ఆర్చర్ చేతికి చిక్కాడు. మిగతావారు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 207 పరుగుల వద్దే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 27 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. ఫ్లంకెట్, స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును గెలిపించిన స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.