ఆ తేదీల్లో చేపమందు పంపిణీ

SMTV Desk 2019-05-31 12:23:55  fish medicine

ఆస్తమా, శ్వాసకోశ వ్యాదులతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతీఏటా హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేపమందు ప్రసాదం ఉచితంగా పంచుతుంటారు. ఈ ఏడాది జూన్ 8,9 తేదీలలో చేపమందు ప్రసాదం పంచబోతున్నట్లు బత్తిని మృగశిర ట్రస్టు అధ్యక్షుడు విశ్వనాధం గౌడ్ తెలిపారు. జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ చేపమందు ప్రసాదాన్ని ఇస్తామని తెలిపారు. ఏ కారణం చేతైనా ఈ రెండు రోజులలో చేపపిల్ల మందును పొందలేకపోయినవారికి మరుసటిరోజున కూకట్‌పల్లి, వనస్థలిపురం, దూద్‌బౌలి, కవాడీగూడలో గల తమ నివాసాల వద్ద మందును ఇస్తామని బత్తిని విశ్వనాధం గౌడ్ తెలిపారు.

చేపపిల్ల మందు పంపిణీ కోసం రాష్ట్ర మత్స్యశాఖ 2 లక్షలకు పైగా చేపపిల్లలను సిద్దం చేస్తోంది. ఎగ్జిబిషన్‌ సొసైటీ, హైదరాబాద్‌ పోలీసులు, విద్యుత్, వాటర్ వర్క్స్, అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, వైద్యశాఖ, రోడ్లు భవనాలశాఖలు దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మొత్తం 42 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. చేపపిల్లను మింగేందుకు ఇష్టపడనివారికోసం బెల్లంలో మందును కలిపి ఇస్తున్నట్లు విశ్వనాధం గౌడ్ తెలిపారు. గత ఏడాది చేపపిల్ల మందు కోసం 4.5 లక్షల మంది వచ్చారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.