ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘నేసమణి’!

SMTV Desk 2019-05-30 19:28:45  nesamani

ప్రస్తుతం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ‘#pray for nesamani’ దూసుకుపోతోంది. ఇంతకీ ఈ నేసమణి ఎవరు? ఎందుకు ఆయన పేరు ఇంతగా ట్రెండ్ అవుతోందన్న విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, పాకిస్థాన్‌కు చెందిన కొందరు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సుత్తి ఫోటోను సోషల్ మీడియాలో చూస్తిస్తూ, ‘ఈ పరికరాన్ని మీ దేశంలో ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి హాస్య నటుడు వడివేలు అభిమానులు కొందరు ‘ఫ్రెండ్స్’ చిత్రంలో ఓ సన్నివేశంలో వడివేలు తలపై సుత్తి పడటంతో అతను కళ్లు తిరిగి పడిపోయే ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన ఒక కార్టూన్ ఫోటోను పోస్ట్ చేశారు.

2001లో తమిళ్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున హీరోగా ‘స్నేహమంటే ఇదేరా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రను తమిళ్‌లో వడివేలు నటించారు. ఆ చిత్రంలో వడివేలు పాత్ర పేరే నేసమణి. వడివేలు అభిమానులు పోస్ట్ చేసిన సన్నివేశాన్ని చూసిన కొందరు నెటిజన్లు వడివేలు నిజంగానే సుత్తి తగిలి పడిపోయాడనుకుని #pray for nesamani హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వడివేలు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే సమంత, సిద్దార్థ్, క్రికెటర్ హర్బజన్ సింగ్ స్పందించారు. దీంతో ఈ నేసమణి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.