ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్!

SMTV Desk 2019-05-30 19:06:54  jagan

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పవన, సౌర విద్యుత్ యూనిట్ రూ.2.50-రూ.3కు దొరుకుతుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.4.84కు కొనుగోలు చేసిందన్నారు. ఇది చాలాక పీక్ అవర్స్ పేరుతో యూనిట్ కు రూ.6 వసూలు చేసేవారని విమర్శించారు. ఈ రేట్లను తమ ప్రభుత్వం పూర్తిగా తగ్గించేస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.

ఏపీలో అవినీతిని రూపుమాపేందుకు రేపు లేదా ఎల్లుండి తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తానని సీఎం జగన్ తెలిపారు. ఓ హైకోర్టు జడ్జీని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కేటాయించాల్సిందిగా కోరతామని వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘ఏ కాంట్రాక్టు అయినా టెండర్లకు పోకముందే కమిషన్ ముందుకు పంపిస్తాం. జడ్జిగారు చేసే సూచనలు, మార్పులను తూచాతప్పకుండా పాటిస్తాం. ఆ తర్వాతే కాంట్రాక్టులను పిలుస్తాం. అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని చెప్పారు.

ఈరోజు ఏపీలో ఇలాంటి మీడియా ఉండటం నిజంగా ప్రజల ఖర్మ అని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ‘ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ5ను చూసినా.. మన ఖర్మ.. అందరం కలిసి చూస్తున్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగతావారెవరూ ఇంపుగా కనిపించరు.

మిగిలినవాళ్లను ఎలా దించాలన్న రీతిలోనే వీరి రాతలు ఉంటాయి. ఈ సంస్థలన్నింటికి నేను ఒక్కటే చెబుతున్నా. మీరు పారదర్శకమైన టెండర్లపై తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా దాఖలు చేస్తాం. వీరిని శిక్షించాల్సిందిగా హైకోర్టును గట్టిగా కోరతాం. ఆరు నెలల నుంచి సంవత్సరం నాకు గడువు ఇవ్వండి. అవినీతి అన్నది ఏపీలో లేకుండా చేస్తా. ఈ విషయంలో ఏపీ ప్రజలందరికీ నేను మాట ఇస్తున్నా’ అని జగన్ తెలిపారు.