ఊరికో సెక్రటేరియట్ తీసుకొస్తాం.. అందులో 10 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం!

SMTV Desk 2019-05-30 18:53:07  jagan

పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు తాము శ్రీకారం చుట్టబోతున్నామని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతీగ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సెక్రటేరియట్ లో దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ బహిరంగ సభలో మాట్లాడారు.

"రేపు పొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ కావాలన్నా మీ పిల్లలే అక్కడ పనిచేస్తారు. కాబట్టి మీరు సెక్రటేరియట్ లో అప్లికేషన్ పెట్టండి. మీరు దరఖాస్తు చేసిన 72 గంటల్లో పని అయిపోతుందని హామీ ఇస్తున్నా. ఏది కావాలన్నా ఇప్పుడు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. కానీ లంచం, సిఫార్సులకు తావేలేకుండా అర్హులైన అందరికీ 72 గంటల్లో దరఖాస్తులు ఆమోదిస్తాం" అని జగన్ తెలిపారు.

గ్రామ వాలంటీర్లు సెక్రటేరియట్ తో అనుసంధానమై నేరుగా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తారని హామీ ఇచ్చారు. నవరత్నాల్లో అన్నింటిని తు.చ తప్పకుండా అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. ‘ఏపీలో స్వచ్ఛమైన, అవినీతి లేని, వివక్ష లేని పాలన అందిస్తాననీ, అవినీతి లేకుండా ప్రక్షాళన చేస్తానని ఏపీలోని 6 కోట్ల ఆంధ్రులకు హామీ ఇస్తున్నా’ అని చెప్పారు. అవినీతి కాంట్రాక్టులను రద్దు చేస్తామని ప్రకటించారు.