నేడు ప్రపంచకప్ స్టార్ట్

SMTV Desk 2019-05-30 16:01:55  icc world cup 2019

లండన్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మెగా టోర్నీ నేడు ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. మే 30న ప్రారంభమయ్యే ప్రపంచకప్ జులై 14న లార్డ్ మైదానంలో జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. ఇంగ్లండ్‌వేల్స్ క్రికెట్ బోర్డులు సంయుక్తగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి ఐసిసి వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ఈసారి విజేతగా నిలిచే జట్టుకు దాదాపు 28 కోట్ల రూపాయల నగదు నజరానా లభించనుంది. సుదీర్ఘ కాలంపాటు సాగే ఈ మెగా టోర్నమెంట్‌ను భారత్‌లో స్టార్ నెట్‌వర్క్, దూరదర్శన్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఇంగ్లండ్‌లో పలు ప్రధాన నగరాలు ప్రపంచకప్‌కు వేదికగా నిలువనున్నాయి. విరాట్ కోహ్లి, ధోని, బుమ్రా, రోహిత్, వార్నర్, స్మిత్, ఫించ్, మోర్గాన్, బట్లర్, బైర్‌స్టో, క్రిస్‌గేల్, రసెల్, హోప్, విలియమ్‌సన్, టైలర్, గుప్టిల్, సౌథి, బౌల్ట్, ఆర్చర్, రబడా, ఆమ్లా, తాహిర్, డుప్లెసిస్, డికాక్, బాబర్ ఆజమ్, సర్ఫరాజ్, రషీద్, నబి, సాకిబ్, మహ్మదుల్లా, రహీం, మలింగ, తిరిమన్నె వంటి స్టార్ క్రికెటర్లు తమ అసాధారణ ఆటతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతంతో పోల్చితే ఈసారి ప్రపంచకప్ సంగ్రామం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గేల్, కోహ్లి, వార్నర్, బైర్‌స్టో తదితరులు ఈ ప్రపంచకప్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. తమ విధ్వంసక ఆటతో కనువిందు చేసేందుకు ఈ దిగ్గజాలు తహతహలాడుతున్నారు. దాదాపు నెలన్నర రోజుల పాటు సాగే క్రికెట్ పండుగను చూసేందుకు కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన అభిమానులు ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పలు దేశాలకు చెందిన అభిమానులు ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. ఇక, వరల్డ్‌కప్ నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తదితర దేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన క్రికెట్‌కు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి.