అసలేం జరుగుతోంది?... టీటీడీ బోర్డులో తీవ్ర గందరగోళం!

SMTV Desk 2019-05-30 14:12:44  ttd

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో జరుగుతున్న పరిణామాలు భక్తులను గందరగోళంలో పడేస్తున్నాయి. రాష్ట్రంలో అధికార ప్రభుత్వం మారిన నేపథ్యంలో, రాజీనామాలు చేసేందుకు ససేమిరా అంటున్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని 8 మంది సభ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న విషయమై ఆసక్తి నెలకొంది.

మొత్తం 12 మంది సభ్యులున్న బోర్డులో, ఇప్పటికే నలుగురు రాజీనామాలు సమర్పించారు. చైర్మన్ సహా మరో ఎనిమిది మంది మాత్రం తాము స్వచ్ఛందంగా తప్పుకునేది లేదని భీష్మించుకుకూర్చున్నారు. వీరిలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన మేడా మల్లికార్జునరెడ్డి తండ్రి మేడా రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఆయన బోర్డు సభ్యత్వ పదవికి ఢోకా లేదని భావించినా, మిగతా ఏడుగురినీ ప్రభుత్వం ఏర్పడగానే తొలగించక తప్పదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

ఇక తొలగించే వారి స్థానంలో బోర్డు చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి లేదా సినీ నటుడు మోహన్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆకేపాటి అమరనాథరెడ్డి, వీరశివారెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డి తదితరులు కూడా బోర్డు సభ్యుల పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద టీటీడీ పాలకమండలిలో అసలేం జరుగుతుందోనని, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ఎప్పటికి తీరుతుందోనని భక్తులు చర్చించుకుంటున్నారు.