జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలనుకున్న చంద్రబాబు....వద్దని వారించిన నేతలు

SMTV Desk 2019-05-29 15:31:32  jagan

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును కూడా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. జగన్ స్వయంగా పిలవడంతో ఈ కార్యక్రమానికి వెళ్లాలని, వెళితేనే హుందాగా ఉంటుందని చంద్రబాబు భావించారు. అయితే, పార్టీ నేతలు వద్దని వారించడంతో ఆయన మనసు మార్చుకున్నారు.

జగన్ రాజ్ భవన్ వంటి వేదికల వద్ద ప్రమాణం చేస్తుంటే వెళ్లొచ్చని, కానీ ఆయన ప్రమాణం చేస్తోంది ఓ బహిరంగ ప్రదేశంలో అని నేతలు చంద్రబాబుకు వివరించారు. దీనిపై పార్టీ ముఖ్యనేత పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు. జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లాలని చంద్రబాబు సుముఖత ప్రదర్శించారని, అయితే గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలకు ప్రతిపక్షాలు హాజరైన నిదర్శనాలే ఏవీ లేదని చంద్రబాబుకు స్పష్టం చేశామని చెప్పారు.

జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనను తామెప్పుడూ అవమానించలేదని, ఇప్పుడు తమకు అవమానాలు ఎదురవుతాయని భయపడడంలేదని పయ్యావుల స్పష్టం చేశారు. కాగా, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు ప్రతినిధులుగా వెళతారని తెలుస్తోంది. ఒకవేళ కార్యక్రమానికి వెళ్లకపోతే జగన్ ఇంటికివెళ్లి పార్టీ తరఫున అభినందనలు వెల్లడించే అవకాశముంది.