10మిలియన్ల మంది ఆకలి కేకలతో అల్లాడిపోతున్న దేశం ఉత్తర కొరియా

SMTV Desk 2019-05-29 15:00:23  north korea

జెనీవా: ఉత్తర కొరియాలో ప్రజల కష్టాలు అంతా ఇంతా కాదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పాలనలో జనం పడుతున్న పాట్లు అనేకం. ఇలాంటి అధ్వాన్న స్థితిలో ప్రజలు ఉన్నా అక్కడి ప్రభుత్వం వారిని ఆదుకోకపోగా.. పుండుపై కారం చల్లినట్లు మరింత వేధిస్తుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నార్త్ కొరియాలో నెలకొన్న పరిస్థితులపై ఒక నివేదిక రిలీజ్ చేసింది. అందులో పలు సంచలన విషయాలు బయటపెట్టింది. ఉత్తర కొరియా అవినీతితో నిండిపోయిందని, అణచివేత సాధారణమని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. శిక్షిస్తామని, జైల్లో పెడతామని బెదిరించి కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజల నుంచి కూడా అక్కడి అధికారులు దోపిడీ చేస్తారని చెప్పింది. ది ప్రైస్ ఈజ్ రైట్స్ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక పేదరికం, అవినీతి, అణచివేత వలలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడిపోతున్నారని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కొరియాలో 10మిలియన్ల మంది ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. దశాబ్దంలో అత్యంత దుర్బరమైన కరువు నేపథ్యంలో ప్రజలపై మరిన్ని ఆంక్షలు పెట్టే అవకాశముందని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. 1990లో ప్రజా పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో ఉత్తర కొరియా ప్రజల కష్టాలు తారాస్థాయికి చేరాయి. దేశ జనాభాల్లో నాల్గింట మూడొంతుల మంది బ్లాక్ మార్కెట్‌లో సరుకులు కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగి అయినా నెలలో కడుపు నిండా తినే పరిస్థితి లేదు. జీతం ఇవ్వకపోవడంతో జీవనోపాధి కోసం ఏదైనా పని చేయకతప్పని పరిస్థితి. అయితే అలా పని చేసుకున్నందుకు కూడా అధికారులకు లంచం చెల్లించాల్సిందేనని యూఎన్ రిపోర్టు చెబుతోంది. 214 మందిని ఇంటర్వ్యూ చేసి మానవ హక్కుల సంఘం ఈ నివేదిక రూపొందించిది. ప్రజలు పడుతున్న కష్టాల గురించి మానవ హక్కుల సంఘం రూపొందించిన నివేదికను నార్త్ కొరియా తోసిపుచ్చింది. రాజకీయంగా ప్రభావితమై ఈ రిపోర్టు తయారూచేశారని ఆరోపించింది. వారికి అవసరమైన నిధులు పొందేందుకు కొంత మంది ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఇలాంటి రిపోర్టులు తయారు చేస్తారని విమర్శించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.