జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న అమలాపురం మహిళ

SMTV Desk 2019-05-29 14:22:48  ap

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ కు ఆలయ అర్చకులు ఈ సందర్భంగా వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం పద్మావతి అతిథిగృహం నుంచి రేణిగుంటకు జగన్ బయలుదేరారు. అయితే పద్మావతి అతిథిగృహం వద్ద జగన్ కాన్వాయ్ ను అమలాపురానికి చెందిన మహిళ అడ్డుకుంది.

ఈ సందర్భంగా వాహనం ఒక్కసారిగా ఆమెను తాకడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే కారు నుంచి దిగిన జగన్ ఆమెను పరామర్శించారు. తన భర్తకు ఉద్యోగం కావాలని జగన్ ను ఆమె కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన వైసీపీ అధినేత తప్పకుండా ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు. జగన్ మరికాసేపట్లో కడపకు చేరుకోనున్నారు.