ముగిసిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం

SMTV Desk 2017-08-27 18:00:48  Chandrababu Naidu,YS Jagan, TDP, YSRCP, Kakinada corporation elections

కాకినాడ, ఆగస్ట్ 27: ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుతున్న నేపధ్యంలో నేటి సాయంత్రం 5గంటల నుండి ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో హోరాహోరీగా ప్రచారాలు సాగించిన అధికార, ప్రతిపక్షాలు తమ ప్రచారాలు ముగించాయి. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించింది. కాగా, ఈ ప్రచార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు పాల్గొన్నారు. ప్రజలు తమ తెదేపా, భాజపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో 39 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు, 9 వార్డుల్లో భాజపా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ప్రచారానికి చివరి రోజైన ఈ ఒక్క రోజు మాత్రమే వైసీపీ అధినేత ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నికల హామీలు అధికార పార్టీ మర్చిపోయిందటూ ఆయన ప్రచారం చేశారు. కాగా, 48 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పల్లంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 17 వార్డుల్లో మాత్రమే పోటీ చేశారు. మొత్తం 48 వార్డులకు 196 కేంద్రాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు చేయగా, 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 121 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీనిస్తున్నారు.