తెలంగాణాలో బీజేపీ లక్కీ గా గెలిచింది : కాంగ్రెస్ నేతలు

SMTV Desk 2019-05-29 12:01:30  utham kumar, Revanth reddy,

లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డిలను కాంగ్రెస్‌ నేతలు నిన్న గాంధీభవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే. తెరాసను ఎప్పటికైనా గద్దె దించేది మేమే. కానీ సిఎం కేసీఆర్‌ మా ఉనికేనే గుర్తించనట్లు ‘కారు...సారు...పదహారు...డిల్లీ సర్కారు...” అంటూ 15 సీట్లు తామే గెలుచుకోబోతున్నామన్నట్లు అహంభావంతో వ్యవహరించారు. అందుకు తెలంగాణ ప్రజలు బాగా బుద్ది చెప్పారు. రాష్ట్రంలో బిజెపికి ఏమాత్రం బలం, ప్రజాధారణ లేవు. ఏదో లక్కీ డిప్ లో గెలిచినట్లు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొంది. మేము కొద్దిపాటి ఓట్ల తేడాతో రెండు ఎంపీ సీట్లు కోల్పోయాము. తెలంగాణ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాల కోసం మేము ముగ్గురం పార్లమెంటులో కేంద్రప్రభుత్వంతో గట్టిగా పోరాడుతాము,” అని అన్నారు.

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “కొడంగల్లో నన్ను ఓడించేందుకు సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ కలిసి చాలా కుట్రలు చేశారు. అక్కడ ఓడినప్పటికీ మల్కాజ్‌గిరి ప్రజలు నాపై నమ్మకముంచి నన్ను ఆదరించి గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించిన ప్రజలే లోక్‌సభ ఎన్నికలలో తెరాసను ఎందుకు ఓడించారని తెరాస అధినేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్‌ అహంభావాణ్ని, అప్రజాస్వామిక చర్యలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మరిచిపోయి విర్రవీగడం వలననే ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణాకు న్యాయంగా రావలసినవాటి కోసం మేము ముగ్గురం పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాము,” అని అన్నారు.