ఇంత ఘోరంగా ఓడిపోతామని ఎన్నడూ అనుకోలేదు

SMTV Desk 2019-05-29 10:39:17  Nara Lokesh,

ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సంచలన వ్యాక్యలు చేసి మరో వివాదానికి కారణం అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవానికి నేతలు, కార్యకర్తలే కారణమని మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని, కనీసం వారిలోని అసంతృప్తిని తెలియజేయడంలోనూ విఫలమయ్యారని అందుకే ఓటమి పాలయ్యామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గుంటూరు పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన, పార్టీ ఓటమికి నేతలు, కార్యకర్తలే బాధ్యలని అన్నారు.

ఇంత ఘోరంగా ఓడిపోతామని ఎన్నడూ అనుకోలేదని, గెలుపు కచ్ఛితంగా మనదేనని చెబుతూ వచ్చిన నేతలు, అబద్ధాలు చెప్పినట్టు అర్థమవుతోందని అన్నారు. పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ వరకూ అనుక్షణం ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పినా అశ్రద్ధ, నిర్లక్ష్యాన్ని వహించారని అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని ఒక్కరు కూడా గుర్తించలేదని, నిత్యమూ ప్రజల్లో ఉండే కార్యకర్తలకు, ఓటర్ల మనసులోని మాట తెలిసినా, దాన్ని తమ వద్దకు తీసుకురాలేక పోయారని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఇకపై ఇటువంటి తప్పులు జరుగకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఓడినా ప్రజల్లో ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, అన్ని రోజులూ ఒకేలా ఉండవని లోకేష్ చెప్పుకొచ్చారు.