పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న రవిప్రకాష్‌

SMTV Desk 2019-05-29 10:35:04  Ravi Prakash, Tv 9

ఫోర్జరీ, మోసం తదితర తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ, దాదాపు మూడు వారాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చినా వాటికి కూడా రవిప్రకాష్‌ స్పందించలేదు. ఇప్పటికే సైబర్‌ క్రైం పోలీసులు రవిప్రకాష్‌ కి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్‌తో పాటు సినీ నటుడు శివాజీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొన్న వారిద్దరూ ఏపీలో ఉన్నారని భావించిన పోలీసులు ఇప్పుడు వారిద్దరూ ఏపీని విడిచి గుజరాత్, మహారాష్ట్ర లేదా కర్ణాటకకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, ముంబైలకు ప్రత్యేక టీమ్ లను పంపిన అధికారులు, బెంగళూరులోనూ రవిప్రకాశ్ కోసం గాలిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించినా, ఆయనకు నిరాశే మిగిలింది. కాగా, ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఏపీలో తలదాచుకున్న రవిప్రకాశ్, ఫలితాల వెల్లడి తరువాత వైసీపీ గెలవగానే ఏపీని వదిలి వెళ్లుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా, వాట్స్ యాప్ ద్వారా తన మిత్రులు, న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.