భవిష్యత్‌లోనూ ప్రజల కోసం పనిచేస్తా

SMTV Desk 2019-05-28 16:56:03  chandrabau, TDp,

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు తొలిసారిగా బయటకు వచ్చారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉండవల్లి ప్రజావేదిక వదిలి బయటకు వచ్చారు. 23వ తేదీ నుంచి చంద్రబాబు ఉండవల్లిలోని తన ఇంటిని దాటి బయటకు రాలేదు. ఇంట్లోనే ఉండి తన వద్దకు వస్తున్న వారిని కలుస్తున్నారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్టీఆర్‌ను చూసి ఆ కష్టాలను మర్చిపోయి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అని ఆయన తెలుగువారికి ఆత్మగౌరవాన్ని ఇచ్చారని.. ఆ నినాదంతో ముందుకు పోవడానికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సిద్ధం ఉండాలని అన్నారు. జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయి, భవిష్యత్‌లోనూ ప్రజల కోసం పనిచేస్తానన్నారు. కార్యకర్తలు చాలా విషయాలను చెబుతున్నారు.. నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పారు తానూ ఓ నాయకుడిగా వారి అభిప్రాయాలను విని ఏది కరెక్టో చూసి అధ్యయనం చేసి కరెక్ట్ చేసుకుంటానని అన్నారు. కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత సమయం ఇవ్వాలి.. వారు కొన్ని చెప్పారు.. ఏమేమీ చేస్తారో చేయనిద్దాం.. బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం, సహకరిద్దామమని అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి 39.2 శాతం ఓట్లు వేశారు.. అంటే 100మందిలో 40మంది ఓట్లు వేశారన్నారు టీడీపీ అధినేత. వారికి సేవలందించి అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.