రీ-వెరిఫికేషన్‌లో 1137 మంది మాత్రమే పాస్

SMTV Desk 2019-05-28 15:58:40  Inter results ,

ఎట్టకేలకు ఇంటర్మీడియట్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు సోమవారం రాత్రి వెలువడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డుపరీక్షలలో ఫెయిల్ అయిన 3,82,116 మంది విద్యార్దుల పరీక్షా పత్రాలను మళ్ళీ కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ చేయగా కేవలం 1,137 మంది మాత్రమే పాస్ అయినట్లు ప్రకటించింది. ఆత్మహత్యలు చేసుకొన్న 23మంది విద్యార్దులలో 20 మంది ఫెయిల్ అయినట్లు దృవీకరించింది. మిగిలిన విద్యార్దుల ఫలితాలలో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. ఫెయిల్ అయిన విద్యార్దులందరికీ ఉచితంగా రీ-వెరిఫికేషన్‌ చేసినందున దాని కోసం దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించిన 21,537 మందికీ జూన్ 12 తరువాత ఫీజు వాపసు చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఫెయిల్ అయిన 3,82,116 మంది విద్యార్దుల పరీక్షా పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో విద్యార్దులకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ సమయాభావం, సాంకేతిక సమస్యల కారణంగా ఇంటర్మీడియేట్ బోర్డు ఆ పనిచేయలేకపోయింది. కానీ ఫెయిల్ అయిన విద్యార్దుల హాల్ టికెట్ల కాపీలను ఆన్‌లైన్‌లో ఉంచింది.

రీ-వెరిఫికేషన్‌లో కేవలం ఒక్క మార్కు అదనంగా పొందడం వలన 80 మంది, రెండు మార్కులు పొంది 156, మూడు మార్కులు పొంది 161, నాలుగు మార్కులు పొంది 140, ఐదు మార్కులు పొంది 95 మంది విద్యార్దులు పాస్ అయ్యారు.