చంద్రబాబుకు మహిళల సంఘీభావం

SMTV Desk 2019-05-28 15:32:32  Cm chandrabau

ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోసం ఏర్పాటు కానున్న వైసీపీ ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు చంద్రబాబు నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యు నేతలు కొందరితో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెదేపా కార్యకర్తలపై దాడుల విషయంలో దీటుగా స్పందించాలని, అవసరమైతే దీని కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించాలని, జిల్లా స్థాయి నాయకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉండేలా చూడాలని నిర్ణయించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు చంద్రబాబు ఇంటికి తరలి వచ్చి సంఘీభావం చెబుతున్నారు. నిన్న కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఆయనను కలిసేందుకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమి పట్ల బాధపడవద్దని అభిమానులు చంద్రబాబుతో చెప్పగా, తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని, ఇలాంటి ఎత్తుపల్లాలు ఎన్నో చూశానని, మీరేమీ అధైర్యపడవద్దంటూ వాళ్లకు ధైర్యం చెప్పి పంపారు. మరికొందరు ఎన్నికల్లో పార్టీ ఓటమిని తలచుకుని కన్నీటి పర్యంతమవగా వారిని చంద్రబాబు సముదాయించారు.