బ్యాటింగ్ లో టీం ఇండియా రాణించాలి ...

SMTV Desk 2019-05-28 15:14:43  virat kohli, shikar dhawan, rohit sharma, icc world cup 2019

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ ముంది టీంఇండియా బ్యాటింగ్ సమస్య ఇబ్బందిగా మారింది అని చెప్పుకోవాలి. తాజాగా ముగిసిన ఐపీఎల్ లో బాగానే ఆడిన టీఇండియా ఆటగాళ్ళు ఇంగ్లండ్ గడ్డపై మాత్రం ఆ స్థాయిలో ఆటను కనబరచలేక పోయారు. తొలి వార్మప్ మ్యాచ్‌లో నిరాశ పరిచిన బ్యాట్స్‌మెన్ రానున్న మ్యాచుల్లో మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు గాడిలో పడక తప్పదు. ఈ ప్రపంచకప్‌లో ఓపెనర్లే జట్టుకు చాలా కీలకమని చెప్పకతప్పదు. ఓపెనర్లు అందించే శుభారంభంపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధావన్, రోహిత్‌లో ఫామ్‌ను అందిపుచ్చుకుంటే భారత్‌కు ఎదురుండదు. వీరిద్దరూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం అసన్నమైంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వన్డే బ్యాట్స్‌మన్‌గా కోహ్లి పేరు తెచ్చుకున్నాడు. అతను రాణిస్తే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. కొంతకాలంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనూ జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఎలా ఆడుతాడనే విషయం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక, నాలుగో నంబర్‌లో కెఎల్.రాహుల్ పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడు. దీంతో అతని ఫామ్‌పై ఆందోళన మొదలైంది. రానున్న మ్యాచుల్లో జట్టులో చోటు కాపాడుకోవాలంటే రాహుల్ తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిందే. ఇక, దినేశ్ కార్తీక్ కూడా ఆటను మెరుగు పరుచుకోక తప్పదు. ఎన్ని అవకాశాలు లభిస్తున్నా కార్తీక్ బ్యాటింగ్‌లో పదును కనిపించడంలో లేదు. ఒకటి అర మ్యాచుల్లో తప్ప అతను పెద్దగా రాణించింది ఏదీ లేదు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా కార్తీక్ మెరుగ్గా ఆడక తప్పదు. విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, కేదార్ జాదవ్‌లు కూడా ఇటు బంతితో, అటు బ్యాటుతో జట్టుకు అండగా నిలువాలి. అప్పుడే భారత్‌కు ప్రపంచకప్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.