ఈటీ మనీలో ఫ్రీగా క్రెడిట్ స్కోరు చెకింగ్

SMTV Desk 2019-05-28 15:09:51  et money, credit score

దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్‌ అయిన ఈటీ మనీ ఇకనుండి క్రెడిట్ స్కోరును ఉచితంగా చెక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా.. రకరకాల అంశాల ఆధారంగా.. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా విశ్లేషించుకోవచ్చు. తద్వారా.. క్రెడిట్ రిపోర్ట్ ఎలా రూపొందుతుంది, మీ స్కోరును ఎలా పెంచుకోవాలనే విషయమై అవగాహనకు రావచ్చు. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉండటం వల్ల తక్కువ వడ్డీకి రుణాలను పొందొచ్చు లేదంటే క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుకోచ్చు. రుణం మంజూరు చేయడానికి ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయనే సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే లీడింగ్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ఎక్స్‌పీరియన్ సహకారంతో ఈటీమనీ క్రెడిట్ స్కోరును అందజేస్తోంది. మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తక్షణమే మీ క్రెడిట్ స్కోరును, రిపోర్టును పొందొచ్చు. మీ చెల్లింపులు ఎలా ఉన్నాయి? క్రెడిట్ కార్డును ఎలా వాడుతున్నారు? రుణాలకు సంబంధించి ఎంక్వయిరీలు చేస్తున్నారా? తదితర అంశాలను లోతుగా తెలుసుకోవచ్చు. తరచుగా మీ క్రెడిట్ రిపోర్టును పరిశీలించుకోవడం వల్ల ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని ఎక్స్‌పీరియన్ క్రెడిట ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ ఆశిష్ సింఘాల్ తెలిపారు.ఈటీ మనీ ద్వారా మన దేశంలో రూ.2 వేల కోట్లను మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఇన్వెస్టర్లు ప్రతినెలా రూ.150 కోట్ల విలువైన పెట్టుబడులను కొత్తగా ఈ యాప్ ద్వారా పెడుతున్నారు. వచ్చే 12-18 నెలల్లోగా రూ.5 వేల కోట్ల విలువైన మ్యూచ్‌వల్ ఫండ్స్ లావాదేవీలను నిర్వహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది నుంచి రుణాలను కూడా ఇస్తోన్న ఈటీ మనీ.. కొద్ది కాలంలో రూ.150 కోట్లకుపైగా రుణాలను మంజూరు చేసింది.