ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రముఖులు

SMTV Desk 2019-05-28 15:02:36  IAS sri laxmi

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం గనుల లీజు, జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని అదే వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లొచ్చిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పుడు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓబుళాపురం గనుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయగా, శ్రీలక్ష్మిని రిమాండ్ లోకి తీసుకుని విచారించారు. అనంతరం శ్రీలక్ష్మికి బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ లభించడంతో రాష్ట్ర విభజన అనంతరం శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ కు కేటాయించగా, ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే ప్రస్తుతం శ్రీలక్ష్మీ ఏపీకి డిప్యూటేషన్ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులంతా ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో కీలక బాధ్యతలు దక్కుతాయనే ఆశలో ఉన్నారు. ఇప్పటికే ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ సీఎస్ గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర సైతం ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టేందుకు స్టీఫెన్ రవీంద్ర సుముఖంగా ఉన్నారు. ఇదే విషయమై ఇప్పటికే కాబోయే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అలాగే మరింకొంత మంది ఆఫీసర్లు సైతం ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.