ఫ్రాన్స్‌లో ఆగని 'పసుపు కోటు' ఉద్యమం

SMTV Desk 2019-05-28 10:57:59  france protest

పారిస్‌: ఫ్రాన్స్‌లో పసుపు కోటు ఉద్యమం ఇప్ప్పటికి నిర్విరామంగా కొనసాగుతుంది. పారిస్‌, బ్రస్సెల్స్‌, ఏమిన్స్‌...మొదలైన నగరాల్లో జరిగిన నిరసన ర్యాలీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని మేక్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు బలప్రయోగానికి దిగారు. పెద్ద ఎత్తున భాష్పవాయునను ప్రయోగించారు. ఆందోళన కారణంగా పారిస్‌, బ్రస్సెల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్థిక సంస్కరణలపై మేక్రాన్‌ ప్రభుత్వం వెనుకంజవేసినప్పటికీ నిరసనలకు ఫులిస్టాప్‌ పడటం లేదు. ముఖ్యంగా మొన్నటి శనివారం బ్రస్సెల్స్‌లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడిక్కడ నిర్బంధాలకు దిగటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అధ్యక్షుడు మేక్రాన్‌ ఆర్థిక విధానాలకు, పన్నుల విధింపునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం నేడు ఉధృతరూపం దాల్చింది. ఆరునెలలుగా ప్రతీవారాంతం జరుగుతున్న నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.ఇంధనంపై పన్నులు పెంచటం, ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తున్నామని మేక్రాన్‌ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఉద్యమం చిన్న చిన్నగా మొదలై ఉగ్రరూపం దాల్చింది. నిరసనలు, ప్రజాగ్రహాన్ని తగ్గించడానికి మేక్రాన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ఆందోళనలు ఆగటం లేదు.