హుజూర్‌నగర్‌ సీటు ఎవరిదో ?

SMTV Desk 2019-05-27 18:05:32  uthak kumar, huzur nagar,

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచినందున, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసి ఉంది. అప్పటి నుంచి ఆరు నెలలలోపుగా ఆ నియోజకవర్గానికి ఉపఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. కనుక ఉపఎన్నికలలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దక్కించుకొంటుందా లేక లోక్‌సభ ఎన్నికలలో పరాభవానికి ప్రతీకారంగా తెరాస ఆ స్థానాన్ని కైవసం చేసుకొంటుందా లేక రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని పదేపదే చెపుతున్న బిజెపి ఆ స్థానాన్ని దక్కించుకొని తన సత్తా చాటుకొంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక హుజూర్‌నగర్‌ నుంచి ఏ పార్టీ ఎవరిని అభ్యర్ధిగా బరిలో దించబోతోందనే మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు. కనుక ఆమెకు తన సీటును ఇప్పించుకొనేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించవచ్చనేది బహిరంగ రహస్యం. ఇక అసెంబ్లీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధి ఎస్. సైదిరెడ్డి 7,466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడి నుంచి పోటీ చేయాలని తెరాస మహిళా నేత శంకరమ్మ విశ్వప్రయత్నాలు చేశారు కానీ టికెట్ లభించలేదు. కనుక టికెట్ కోసం వారిరువురితో పాటు తెరాసలో మరికొందరు పోటీ పడవచ్చు.

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాభవం పొందిన బిజెపి, లోక్‌సభ ఎన్నికలలో పుంజుకోవడంతో ఈసారి హుజూర్‌నగర్‌ను దక్కించుకోవడం కోసం బలమైన అభ్యర్ధిని నిలబెట్టవచ్చు. కానీ ఈ మూడు పార్టీలలో ఏది హుజూర్‌నగర్‌ సీటును గెలుచుకొంటుందో చూడాలి.