అసలు ఎవరీ సారంగీ?...... ఆయన్ని 'ఒడిశా మోదీ' అని ఎందుకంటారు?

SMTV Desk 2019-05-27 17:51:42  odisha modi

ఒడిశాలోని బాలాసోర్ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ తరపున పోటీచేసిన ప్రతాప్ చంద్ర సారంగీ విజయం సాధించారు. ఆయన బీజేడీ అభ్యర్థి రవీంద్ర కుమార్ జెనాను 12,956 ఓట్ల తేడాతో ఓడించారు. 2014లో ఓటమి చవిచూసిన ప్రతాప్ చంద్ర సారంగీ ఈ సారి విజయం దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో ప్రతాప్ చంద్ర సారంగీ చర్చనీయాంశంగా మారారు. జనం ఆయనను ‘ఒడిశా మోదీ’ అంటున్నారు. సారంగీ చాలాకాలంగా సమాజసేవ చేస్తూ వస్తున్నారు. ఆయన వివాహం కూడా చేసుకోకుండా చిన్న గదిలో నివాసముంటున్నారు.

ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే! అయినా ఆయనకు జనంలో విపరీతమైన ఆదరణ ఉండటం విశేషం. ఉత్కళ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన సారంగీ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనాపరునిగా పెరిగారు. రామకృష్ణా మఠంలో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సైకిల్‌పై ప్రయాణాలు సాగించే ఆయన ఆదివాసీ ప్రాంతమైన మయూర్ భంజ్, బాలాసోర్‌లలో పాఠశాలలు నెలకొల్పారు. నరేంద్ర మోదీకి సారంగి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. మోదీ ఒడిశా వచ్చినప్పుడల్లా సారంగిని కలుస్తుంటారు.