ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌: ఇంటిబాట పట్టిన కెర్బర్‌, వీనస్

SMTV Desk 2019-05-27 17:41:05  french open tennis tournament

పారిస్: ఆదివారం ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో వింబుల్డన్ చాంపియన్, అయిదో సీడ్ అయిన జర్మనీకి చెందిర కెర్బర్‌ను ఢీకొన్న రష్యాకు చెందిన టీనేజర్ అనస్టాసియా పొటపోవా 64, 6 2 స్కోరుతో ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. అయితే కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. కుడికాలి చీలమండ గాయం కారణంగానే ఆమె ఇటాలియన్ ఓపెన్‌నుంచి వైదొలగడంతో పాటు మాడ్రిడ్ మాస్టర్స్‌లో రెండో రౌండ్ మ్యాచ్‌కి ముందు తప్పుకోవలసి వచ్చింది. కాగా తాను ఈ టోర్నమెంట్‌కు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేదని చెప్పిన కెర్బర్ తన ప్రత్యర్థి చాలా బాగా ఆడిందంటూ కితాబు ఇచ్చింది. ఇదిలా ఉండగా టాప్ టెన్ క్రీడాకారిణిపై పొటపోవాకు ఇది తొలి విజయం కావడం విశేషం. రెండో రౌండ్‌లో ఆమె చైనాకు చెందిన వాంగ్ యాఫాన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన మర్కెతా వొండ్రౌసోవాల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టింది. స్విటోలినాతో జరిగిన మ్యాచ్‌లో 3 6,3 6 స్కోరుతో వరస సెట్లలో ఓటమి పాలయింది. కాగా కొత్తగా నిర్మించిన సెంటర్ కోర్టులో తొలి మ్యాచ్ ఆడే గౌరవం స్పెయిన్‌కు చెందిన గార్బిన్ ముగురుజాకు దక్కింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన టేలర్ టౌన్‌సెండ్‌ను 5 7,6 2,6 2 స్కోరుతో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది. 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయిన ముగురుజా రెండో రౌండ్‌లో జొహన్నా లార్సన్‌తో తలపడుతుంది. తొలి రౌండ్‌లో లార్సన్ స్లోవేకియాకు చెందిన మగ్దలెనా రిబరికోవాపై విజయం సాధించింది. కాగా, క్రోయేషియాకు చెందిన పెట్రా మార్టిక్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ విజేతగా నిలిచింది. టునీసియాకు చెందిన ఓన్స్ జెబేర్‌పై ఆమె 61, 6 2 స్కోరుతో సునాయాపంగా విజయం సాధించింది. ఇక పురుషుల విభాగం తొలి రౌండ్ మ్యాచ్‌లలో టోర్నమెంట్ టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన స్టెఫానస్ సిట్సిపాస్ తన దూకుడు ఆటను ప్రదర్శించి 6 2,6 2, 7 6(4) వరస సెట్లలో జర్మనీకి చెందిన మార్టెరర్‌పై సునాయాసంగా గెలుపొందాడు. కాగా ఈ టోర్నమెంట్‌లో రెండు సార్లు క్వార్టర్ ఫైనల్స్ దాకా చేరిన మార్టిన్ సిలిచ్ కూడా ఇటలీకి చెందిన థామస్ ఫాబియానోపై 6 3, 7 5,6 1తో ఓడించి ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో సిలిచ్ బల్గేరియాకు చెందిన గ్రిగోర్ దిమిత్రోవ్‌ను ఢీకొంటాడు. తొలి రౌండ్‌లోనే దిమత్రోవ్ సెర్బియాకు చెందిన జాంకో తిప్సరెవిక్‌పై అయిదు సెట్ల హోరాహోరీ పోరులో విజయం సాధించాల్సి వచ్చింది. చివరి సెట్‌లో 54 ఆధిక్యతలో ఉన్నప్పుడు సర్వ్ చేస్తూ బ్రేక్ పాయింట్‌ను ఎదుర్కొన్నప్పటికీ చివరికి 6 3,6 0,3 6,6 7, 6 4 స్కోరుతో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడు. కాగా మరో మాచ్‌లో మూడో సీడ్, స్విస్ వీరుడు ఫెడరర్ ఇటలీకి చెందిన లోరెంజో సొనేగోపై 6 2,6 4,6 4 స్కోరుతో సునాయాసంగా విజయం సాధించాడు. 2015 తర్వాత ఫెదరర్ తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతుండడం ఇప్పుడే కావడం విశేషం. జపాన్‌కు చెందిన నిషికోరా కూడా రెండో రౌండ్‌లో ప్రవేశించాడు.