బౌలింగ్‌ కోసం కోహ్లి బంతిని ఇవ్వగానే ఒత్తిడికి గురయ్యా: శంకర్

SMTV Desk 2019-05-27 16:23:42  vijya shankar

టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్ అత్యంత తక్కువ కాలంలో మెరుగైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఎంతలా అంటే..? నెం.4 స్థానం కోసం సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడ్ని పక్కనపెట్టి మరీ సెలక్టర్లు విజయ్ శంకర్‌ని ప్రపంచకప్‌ టీమ్‌లోకి ఎంపిక చేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ఈ ఏడాది జనవరిలో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా వన్డే టీమ్‌లోకి అరంగేట్రం చేశాడు శంకర్. కానీ.. అరంగేట్రం వన్డేలో తాను ఒత్తిడికి గురైనట్లు తాజాగా విజయ్ శంకర్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన శంకర్ 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కానీ.. పొదుపు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో శంకర్‌కి బ్యాటింగ్ అవకాశం రాలేదు. ‘మెల్‌బోర్న్ వేదికగా నేను వన్డేల్లోకి అరంగేట్రం చేశాను. అప్పటి వరకూ నేను అంత పెద్ద స్టేడియం, అభిమానుల మధ్య మ్యాచ్ ఆడలేదు. దీంతో.. బౌలింగ్‌ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లి నా చేతికి బంతిని ఇవ్వగానే ఒత్తిడికి గురయ్యా. దీంతో.. నా వద్దకి వచ్చిన ధోనీ కూల్‌గా కాసేపు మాట్లాడి.. సరైన ప్రదేశంలో బంతిని విసరమని సూచించాడు. వాస్తవానికి అది చాలా చిన్న సలహానే. కానీ.. ఆ ఒత్తిడిలో ధోనీ మాటలు నాకు గొప్ప ఉపశమనం కలిగించాయి. ఆ తర్వాత ఒత్తిడిని అధిగమించి చక్కగా బౌలింగ్ చేయగలిగాను’ అని విజయ్ శంకర్ వెల్లడించాడు.