బ్రిటన్ ప్రధాని పదవి బరిలోకి 8 మంది

SMTV Desk 2019-05-27 16:06:23  Britain prime minister, Theresa may, Britain prime minister elections

లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే వచ్చే నెల 7న తన పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రధాని పదవికి పోటీ చేసేందుకు 8 మంది సిద్దమయ్యారు. జూన్ పదవ తేదీ నుంచి నాయకత్వ పోటీకి అధికారిక ప్రక్రియ ఆరంభం అవుతుంది. అయితే ఈ లోగానే ప్రధాని పదవికి పలువురు అభ్యర్థులు తమ సంసిద్థతను వ్యక్తం చేస్తూండటంతో బ్రిటన్‌లో ఇప్పుడు తదుపరి ప్రధాని ఎవ్వరనేది కీలకంగా మారింది. బ్రెగ్జిట్ కీలక అనుకూలవాదిగా ఉన్న విదేశాంగ మాజీ మంత్రి బోరిస్ జాన్సన్ ఆపద్థర్మ ప్రధాని థెరెసా మేకు వారసులు అవుతారని , ఆయన ఈ పోటీలో ముందున్నారని వెల్లడైంది. అయితే కనీసం మరో ఏడుగురితో ఆయన పోటీ పడాల్సి వస్తోంది. జాన్సన్‌కు పోటీగా ఆదివారం బ్రిటన్ పర్యావరణ మంత్రి మైకెల్ గోవే రంగంలోకి దిగారు. దేశ ప్రధాని పదవికి పోటీ కోసం తాను పోటీకి దిగుతున్నట్లు , ఇప్పటివరకూ అంతా అనుకుంటున్న దానిని ఇప్పుడు నిర్థారిస్తున్నట్లు , తన అభ్యర్థిత్వం విషయంలో కన్సర్వేటివ్ పార్టీని ఏకం చేయగలనని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనమైన దేశానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆదివారం ఆయన లండన్‌లోని తమ నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. 2016లో జరిగిన పార్టీ నాయకత్వ పోటీ సమయంలో గోవే తీరు వివాదాస్పదం అయింది. అప్పట్లో జాన్సన్ ప్రధాని పదవికి ప్రధాన పోటీదారుగా ముందుకు వచ్చారు. అయితే తొలుత ఆయనకు మద్దతు ప్రకటించిన గోవే తరువాత నిర్ణయం మార్చుకుని జాన్సన్‌కు నమ్మకద్రోహం చేసినట్లు విమర్శలు వెలువడ్డాయి.