నంద్యాల ఉపఎన్నికల కౌంటింగ్ కు భారీ బందోబస్తు: జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ

SMTV Desk 2017-08-26 18:37:55  Namdyala, by-polls results, Counting date, District SP

నంద్యాల, ఆగస్ట్ 26: ఇటు అధికార పక్షం, అటు ప్రధాన ప్రతిపక్షం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నంద్యాల ఉపఎన్నికలు ఈ నెల 23న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ చెప్పారు. స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బలగాలతో మోహరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఏఎస్సైలు, 260 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు, 44 సెక్షన్ల ఏఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ బలగాలు, 5 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. ఫలితాలు వెల్లడించిన అనంతరం ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొబైల్ పార్టీలు, పికెట్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, కౌంటింగ్ ప్రక్రియ 28వ తేదీ సోమవారం జరగనుంది.