పకడ్బందీగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్

SMTV Desk 2019-05-27 13:33:13  Gold monitisation scheme

నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చింది. తొలి విడతలోనే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బంగారం విధానంలో సంస్కరణలు తెచ్చిన మోదీ సర్కారు, ఈ సారి అధికారంలోకి రాదనే అనుకున్నారు. కానీ జనం ఆయనకే వోట్ వేయడంతో ఇప్పుడు మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సిద్దమవుతున్నాడు మోడీ. ఇందులో భాగంగా, గతంలో ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. ఇండియాలో బంగారాన్ని ఆస్తిగా భావిస్తారు, నిజానికి ప్రపంచ దేశాలలోనే అలంకరాణార్ధం బంగారాన్ని అత్యధికంగా వాడుతున్నది ఇండియాలోనే. ఇండియాలో అమ్మలక్కల వద్దే సుమారు 25 వేల టన్నులకు పైగా బంగారం ఉంది.

ఇక దేవాలయాల్లో 3,500 నుంచి 4,000 టన్నుల వరకూ బంగారం ఉంటుందని అంచనా. గత సంవత్సరం జీఎంఎస్ స్కీమ్ కింద 18 టన్నుల బంగారం బ్యాంకులకు వచ్చింది. 26 టన్నుల విలువైన బంగారం బాండ్లను ప్రభుత్వం విక్రయించింది. 749 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అయింది. వినియోగంలో ఉన్న బంగారంతో పోలిస్తే, జీఎంఎస్ కు వచ్చిన స్పందన అత్యంత నామమాత్రమే.దీన్ని దృష్టిలో పెట్టుకుని, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కు ముందే గోల్డ్ బోర్డ్ ను సమావేశపరిచి, ప్రీసియస్ మెటల్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం 2019కి ఆమోదం తెలపాలన్నది మోదీ ఆలోచనగా తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం 5 గ్రాముల స్వల్ప బంగారాన్ని కూడా ట్రేడింగ్ చేసుకునేలా నూతన నిబంధనలుంటాయట, అలాగే బంగారం డెలివరీ నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా రూపొందిస్తారని చెబుతున్నారు.