థాయ్‌లాండ్ మాజీ ప్రధాని కన్నుమూత

SMTV Desk 2019-05-27 13:11:37  thailand, Prime minister,

థాయ్‌లాండ్ మాజీ ప్రధాని జనరల్‌ ప్రేమ్‌ టిన్సులనోండా (98) ఆదివారం ఉదయం కన్నుమూశారు. టిన్సులనోండా 1980 నుంచి 1988 మధ్యకాలంలో మూడు సార్లు ఆ దేశ ప్రధానిగా పని చేశారు. ప్రస్తుతం మహారాజు సలహాదారుల కమిటీలో ఆయన కీలక పదవిలో ఉన్నారు. 2016లో థాయ్‌లాండ్‌ రాజు భుమిబోల్‌ మృతి అనంతరం పరిపాలనలో టిన్సులనోండా కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఈ నెల మొదటివారంలో జరిగిన భుమిటోల్ కొడుకు విజయాలంగ్ కర్న్ పట్టాభిషేకం సందర్భంలో కూడా టిన్సులనోండా కీలకంగా వ్యవహరించారు. అయితే టిన్సులనోండా మృతిని ధృవీకరించిన రాజకుటుంబం , ఆయన మృతికి దారి తీసిన కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాజరిక పాలనకు వ్యతిరేకంగా దేశంలో పలుమార్లు తిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాట్లను అణిచివేయడంలో టిన్సులనోండా ప్రముఖంగా వ్యవహరించారు. టిన్సులనోండా మృతితో దేశంలో తొలిసారిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆ దేశ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలోని ఆర్మీ ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీకి చెందిన ప్రయూత్ ఛాన్ ఓచాను ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దించాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆర్మీ పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు మధ్య వారధిగా టిన్సులనోండా వ్యవహరించడంతో అక్కడి ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. దీంతో టిన్సులనోండా మృతితో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. సోమవారం ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపనున్నారు.