వరల్డ్ కప్ కి ముందు భారత్ కు ద్రవిడ్ కీలక సూచనలు

SMTV Desk 2019-05-27 13:08:27  Dravid,

ముంబై: ప్రపంచకప్‌లో విజయం సాధించాలంటే బౌలర్లు అసాధారణ ప్రతిభను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సూచించాడు. కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదనే విషయాన్ని ద్రవిడ్ గుర్తు చేశాడు. భారీ స్కోర్లు సాధించినా దాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమవుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నాడు. ఇటీవల భారత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమే దీనికి నిదర్శనమన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా కొన్ని విషయాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయన్నాడు. కీలక సమయంలో వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమవుతున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నాడు. అయితే బౌలింగ్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచే అవకాశం ఉందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్, షమిలతో కూడిన పటిష్టమైన బౌలింగ్ లైనప్ భారత్‌కు ఉందన్నాడు. వీరంత సమష్టిగా రాణిస్తే విజయాలు సాధించడం కష్టం కాదన్నాడు. ఇక, ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జట్లలో భారత్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉందన్నాడు. రోహిత్, ధావన్, కోహ్లి, జాదవ్, కార్తీక్, ధోని తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉందన్నాడు. దీంతో భారత్ మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని ద్రవిడ్ జోస్యం చెప్పాడు.