విప్లవాత్మక మార్పులు తెస్తా: జగన్

SMTV Desk 2019-05-27 12:34:06  Jagan,

ఎపి అప్పుల ఊబిలో కూరుకపోయిందని వైసిపి చీఫ్, కాబోయే సిఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రూ. 97 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో రూ.2.57 లక్షల కోట్లకు అప్పులు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అప్పులపై వడ్డీయే దాదాపు రూ.20వేల కోట్లు చెల్లిస్తున్నట్టు జగన్ చెప్పారు. ఆదివారం జగన్ ప్రధాని మోడీని కలిశారు. ఈ నెల 30న విజయవాడలో సిఎంగా తాను ప్రమాణస్వీకారం చేయనున్నానని, ఈ కార్యక్రమానికి రావాలని జగన్ మోడీని ఆహ్వానించారు. అనంతరం ఎపి భవన్ లో జగన్ మీడియాతో మాట్లాడారు. ఎపి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఎపికి కేంద్ర సహకారం అవసరమని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితిపై తాను తెలుసుకున్న అంశాలను ప్రధాని మోడీకి వివరించానని జగన్ చెప్పారు. ఎపికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని మోడీని కోరానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. ఓవర్ డ్రాప్ట్ పై ఎపి బతుకుతున్న తీరుపై మోడీకి వివరించానని ఆయన వెల్లడించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. ఎపికి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ పూర్తి మద్ధతు పలికారని, ప్రత్యేక హోదా వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని జగన్ తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నప్పడే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ చెప్పారు. కేంద్రం నుంచి ఎపికి అందాల్సిన సహాయం ఆలస్యమైందని ఆయన తెలిపారు. భవిష్యత్ లోనూ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతానని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చూస్తామని, తమ పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తామని జగన్ వెల్లడించారు.