ఎన్డీయే పార్లమెంటరీ నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

SMTV Desk 2019-05-27 12:03:53  nda

ఎన్డీయే కూటమి పార్లమెంటరీ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. ఇవాళ ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్ లో సమావేశమైన ఎన్డీయే పక్షాల ఎంపీలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును అమిత్ షా ప్రతిపాదించగా, సీనియర్ నేతలు నితిన్ గడ్కరీ, నితీశ్ కుమార్, ఉద్ధవ్ థాకరే, రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు బలపరిచారు. ఎంపీలు బల్లలు చరిచి తమ ఆమోదం తెలపడంతో ఒక లాంఛనం ముగిసినట్టయింది.

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సువిశాల భారతదేశంలో అతిపెద్ద ఘట్టం అయిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో సజావుగా నిర్వహించింది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో క్లిష్టమైన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందంటూ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఎన్డీయే విజయాన్నే కాంక్షించారని మోదీ తెలిపారు.

ఇది ప్రజల విజయం, నన్ను కూడా మీలో ఒకడిగా భావించండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు మరింత ఉత్సాహంతో ముందుకెళతామని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సేవాభావాన్ని మాత్రం విస్మరించబోమని మోదీ స్పష్టం చేశారు.