మహిళలకు కేసీఆర్ బతుకమ్మ కానుక

SMTV Desk 2017-08-26 15:59:39  TELANGANA GOVERNMENT, BATHUKAMMA FESTIVAL, SAREES GIFT, CM KCR

హైదరాబాద్, ఆగస్ట్ 26 : తెలంగాణ జాతీయ పండగగా పేరొందిన బతుకమ్మ పండగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం పేద మహిళలకు బహుమానాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కోటి మందికి పైగా మహిళలకు చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు చీరల పంపిణీ చేసే కార్యక్రమంపై ప్రగతి భవన్‌లో కేసీఆర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 18 నుంచి మూడు రోజులపాటు రేషన్ షాపుల ద్వారా ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా తెలంగాణ జీవితం, సంస్కృతిలో భాగ‌మై, కుటుంబ విలువ‌ల‌కు అద్దం పట్టే బ‌తుక‌మ్మ పండుగ, సంతోషాల‌ను రెట్టింపు చేసేందుకు ఈ చీర‌లు బహుకరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం చేనేత కార్మికుల నుంచి చీర‌లు కొనుగోలు చేసి చీరల నాణ్యతను పరీక్షించి పంచడానికి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని కేసీఆర్ కోరారు.