ఆయనొక్కరే ప్రమాణస్వీకారం

SMTV Desk 2019-05-25 22:17:28  jagan,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అయితే జంబో టీం కావడంతో మంత్రి పదవులకు ఆశావాహులకు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 30న ఆయనొక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆ రోజు మంత్రులెవరూ ఉండకపోవచ్చని, జూన్‌ మొదటి వారంలో 20 మంది మంత్రులను మంత్రివర్గంలో చేర్చుకుంటారని విశ్వసనీయ వర్గాలా సమాచారం. కొద్ది నెలల తరవాత పూర్తి స్థాయి విస్తరణ చేసి జంబో మంత్రి వర్గం ఏర్పాటు చేయాలని జగన్ ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఏపీ కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రాంతాలు, వర్గాల నేపథ్యంగా తమకూ అవకాశం వస్తుందేమోనని భావించే వారు పదుల సంఖ్యలో ఉన్నారు. జగన్ ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని అంటున్నారు. విశాఖపట్నం జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్‌ (భీమిలి), పశ్చిమగోదావరి జిల్లా నుంచి గ్రంధి శ్రీనివాస్‌(భీమవరం), కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని(గుడివాడ), గుంటూరు జిల్లా నుంచి సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(ఎమ్మెల్సీ కోటా), అనంతపురం జిల్లా నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(రాప్తాడు), వెంకట్రామిరెడ్డి(ధర్మవరం), చిత్తూరు జిల్ల్లా నుండి రోజా, చెవి రెడ్డి, గుంటూరు నుండి అంబటి రాంబాబు, తదితరుల పేర్లు సైతం ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.