త్వరలో లక్ష రూపాయల రుణమాఫీ పధకం అమలు

SMTV Desk 2019-05-25 16:06:46  farmers

శుక్రవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ‘విత్తన మేళా-2019’ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ పధకం అమలుచేస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు సిఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున అవన్నీ పూర్తయితే రాష్ట్రంలో రైతుల పరిస్థితులు చాలా మెరుగుపడతాయని అన్నారు. ఇప్పటికే వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ఇస్తోందని, యువత కూడా వ్యవసాయరంగంలో ప్రవేశించేలా అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని, అందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరమైనవన్నీ సమకూర్చుతూ, వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి ముందుకు సాగాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి చెప్పారు. సిఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న పధకాలు, ప్రాజెక్టులు అన్ని అందుబాటులోకి వస్తే వ్యవసాయరంగంలోనే కోట్లాదిమందికి ఉపాది అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు.

పంటలకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందజేస్తోంది. పంటపెట్టుబడిగా ఎకరానికి రూ.5,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10,000 చొప్పున అందజేస్తోంది. అలాగే కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల సరఫరాదారులపై కటినమైన చర్యలు తీసుకొంటోంది. ఇవన్నీ రైతులకు చాలా మేలు చేసేవే కానీ పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించనప్పుడు ఈ శ్రమ అంతా వృదాయే అవుతుంది. రైతులు ఎండనకా వాననకా రేయింబవళ్లు కష్టపడి అప్పులు చేసి మరీ పండించిన తమ పంటలను వ్యవసాయమార్కెట్ల వద్దకు తీసుకువస్తే అక్కడ వాటిని గిట్టుబాటు ధర చెల్లించి కొనే నాధుడు ఉండడు. వ్యాపారులు, దళారులు రైతులను నిలువునా దోచుకొంటూనే ఉన్నారు.

అయినకాడికి పంటను అమ్ముకోవాలన్నా రోజుల తరబడి ఎదురుచూడక తప్పదు. ఆలోగా వర్షంపడితే ఇక అంతే సంగతులు. ప్రతీసారి గోనె సంచులు లేవు... కూలీలు లేరు...మార్కెట్ కు శలవుదినాలు... ధరలు పడిపోయాయి... అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. కనుక ఈ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించిననాడే ప్రభుత్వం ఆశయం నెరవేరుతుంది. లేకుంటే ప్రభుత్వం, రైతుల శ్రమ అంతా చెరువులో పిసికిన చింతపండే అవుతుంది.