ఆ త్రీడీ ట్వీట్ నా గురించి కాదు: శంకర్

SMTV Desk 2019-05-25 15:57:51  ambati rayudu, vijayashankar, icc world cup 2019

వరల్డ్ కప్ మెగా టోర్నీలో టీంఇండియా జట్టులో అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంతో....తనని ఎంపిక చేయలేదని కొద్దిరోజుల క్రితం రాయుడు చేసిన 3D ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. గత నెలలో 15 మందితో కూడిన భారత్ జట్టుని సెలక్టర్లు ఎంపిక చేశారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం రాయుడ్ని ఎంపిక చేస్తారని అందరూ ఊహించగా.. అనూహ్యంగా అతని స్థానంలో విజయ్ శంకర్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు. రాయుడితో పోలిస్తే..? విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు కోణాల్లో (Three Dimensional) టీమ్‌కి ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయంలో వివరణ ఇచ్చారు.ప్రపంచకప్‌ జట్టు ప్రకటన తర్వాత రోజే చీఫ్ సెలక్టర్ వివరణపై అంబటి రాయుడు చురకలేస్తూ ఓ ట్వీట్ వదిలాడు ‘వరల్డ్‌ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను’ అని సెటైర్ వేశాడు. దీంతో.. విజయ్ శంకర్‌కి పరోక్షంగా రాయుడు కౌంటరిచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. దీనిపై రాయుడు, శంకర్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ.. తాజాగా ఎట్టకేలకి విజయ్ శంకర్ ఆ ట్వీట్‌పై పెదవి విప్పాడు. ‘జట్టులోకి ఎంపికవకపోతే సదరు క్రికెటర్ ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అంబటి రాయుడు పరిస్థితిని ఓ క్రికెటర్‌గా నేను అర్థం చేసుకోగలను. అయితే.. ఆ త్రీడీ ట్వీట్ నా గురించి కాదు’ అని విజయ్ శంకర్ వెల్లడించాడు.