ప్రత్యర్ధులు గెలుపును ప్రభుత్వ వ్యతిరేకతగా చూడరాదు

SMTV Desk 2019-05-25 15:57:09  talasani yadav

లోక్‌సభ ఎన్నికలలో తెరాస 9 సీట్లు మాత్రమే గెలుచుకోవడం, కాంగ్రెస్‌, బిజెపిలు అనూహ్యంగా 7 సీట్లు గెలుచుకోవడంపై రాజకీయవర్గాలలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర పశుసంవర్ధకశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “జాతీయాంశాలు ప్రభావం చూపడం వలననే సికిందరాబాద్‌ నుంచి పోటీ చేసిన నా కుమారుడు సాయి కిరణ్ ఓడిపోయాడని భావిస్తున్నాను. మిగిలిన 6 స్థానాలలో మా ప్రత్యర్ధులు గెలుపును ప్రభుత్వ వ్యతిరేకతగా చూడరాదు. సిఎం కేసీఆర్‌ పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రజలందరూ కేసీఆర్‌ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. అయితే ఈ ఓటమిని ఒక గుణపాఠంగా స్వీకరించి తప్పులు, లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని ముందుకు సాగుతాము,” అని అన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో జాతీయ అంశాల ప్రస్తావన వచ్చినప్పటికీ ‘కారు...సారు...పదహారు’ అనే తెరాస నినాదమే ఎక్కువగా వినిపించిది. తెరాస వాదన ముందు ప్రతిపక్షాల వాదనలు తేలిపోయాయి. ఆ నమ్మకంతోనే తెరాస 16 సీట్లు గెలుచుకొంటుందని సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలందరూ నమ్మకంగా చెప్పారు. కానీ రేణుకా చౌదరి చెప్పినట్లుగా నాలుగు నియోజకవర్గాలలో బిజెపి చాప కింద నీరులా విస్తరించడాన్ని పసిగట్టడంలో తెరాస విఫలమైంది. అలాగే రాష్ట్రంలో రైతుల భూసమస్యలను, ముఖ్యంగా నిజామాబాద్‌ రైతుల ఆగ్రహాన్ని తెరాస తేలికగా తీసుకొంది.

తెరాస నుంచి అవమానకరంగా బయటకు వచ్చిన డిశ్రీనివాస్ కూడా తెరాసపై ప్రతీకారం తీర్చుకొనేందుకు, తన కుమారుడు డి.అరవింద్ ను గెలిపించుకొనేందుకు తెర వెనుక గట్టిగానే ప్రయత్నించి ఉండవచ్చు. ఇటువంటి అనేక కారణాల చేత తెరాస నాలుగు స్థానాలను బిజెపికి కోల్పోగా, కాంగ్రెస్‌ అభ్యర్దులను ఓడించడానికి గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ వారు తమ సొంతబలంతో గెలవడంతో వారికి మరో 3 స్థానాలు కోల్పోయింది.