ఆసిస్ కు ఎదురు ఉందా!

SMTV Desk 2019-05-25 15:56:32  icc wrold cup 2019, Australia

ప్రపంచకప్ మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అంటే ఆస్ట్రేలియానే. ఆసిస్ ఏ జట్టుకు అందనంత దూరంలో నిలిచింది. ఈ జట్టు రికార్డు స్థాయిలో ఐదు సార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. భారత్, విండీస్ జట్లు రెండేసి సార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకోగా, ఆస్ట్రేలియా ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచి ప్రకంపనలు సృష్టించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియా భారీ ఆశలతో ప్రపంచకప్‌కు సిద్ధమైంది. కొంతకాలంగా ఆస్ట్రేలియా క్రికెట్ కష్టకాలంలో ఉంది. బాల్ టాంపరింగ్ వివాదం జట్టును పట్టి పీడించింది. ఈ వివాదం నేపథ్యంలో స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వీరు లేని సమయంలో ఆస్ట్రేలియా ఎన్నో అవమానకర ఓటములను చవిచూడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం స్మిత్, వార్నర్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చారు. వీరి రాకతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచకప్‌లో ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక, ఆస్ట్రేలియాకు ప్రపంచకప్‌లో ఘనమైన రికార్డు ఉంది. ఏ జట్టు సాధించని ఘనతను ఆస్ట్రేలియా సాధించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్‌లో ఏ జట్టు కూడా ఇన్ని సార్లు ట్రోఫీని గెలవలేదు. 1987లో తొలిసారి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండోసారి 1999లో ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారింది. తర్వాత జరిగిన రెండు ప్రపంచకప్‌లలో కూడా ట్రోఫీని గెలిచి హ్యాట్రిక్ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో వరుసగా మూడు సార్లు ట్రోఫీని గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా అరుదైన రికార్డును సాధించింది. 2003, 2007లలో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలిచింది. ఇక, 2007లో జరిగిన మెగా సంగ్రామంలో కూడా ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఐదుసార్లు ప్రపంచకప్‌ను గెలిచి ఎవరికి అందనంత దూరంలో నిలిచింది. ఈసారి కూడా గెలిచి రికార్డును మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది.మరోవైపు దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ రాకతో ఆస్ట్రేలియా మరోసారి ఫేవరెట్‌గా మారింది. ఇంగ్లండ్ పిచ్‌లపై మంచి రికార్డు కలిగిన ఆస్ట్రేలియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. వార్నర్, స్టివ్ స్మిత్‌లు చేరడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్‌పై ఆస్ట్రేలియా భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో వార్నర్ పరుగుల సునామీ సృష్టించాడు. భారీ స్కోర్లతో సత్తా చాటాడు. భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్ ప్రపంచకప్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. వార్నర్ చెలరేగితే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు గెలుపు నల్లేరుపై నడకేనని చెప్పాలి. స్మిత్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ కూడా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. మాక్స్‌వెల్, స్టోయినిస్, షాన్‌మార్ష్, లియాన్, ఖ్వాజా, హాజిల్‌వుడ్, స్టార్క్, కమిన్స్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. ఇతర జట్లతో పోల్చితే ఆస్ట్రేలియా పోరాట పటిమ అసాధారణంగా ఉంటుంది. ఒత్తిడిలోనూ సర్వం ఒడ్డి పోరాడడం వారికే చెల్లుతోంది. దీంతో ఈసారి కూడా భారీ ఆశలతో మెగా సంగ్రామానికి సిద్ధమైంది.