భద్రతలేని భవనంలో కోచింగ్‌ సెంటర్‌.. 20 మంది మృత్యువాత - నిర్వాహకుడి అరెస్టు

SMTV Desk 2019-05-25 15:55:15  crime

భద్రతా ప్రమాణాల్లేని భవనంలో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించి 20 మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడన్న కేసులో కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడిని అక్కడి పోలీసు అరెస్టు చేశారు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని తక్షశిల వాణిజ్య సముదాయంలో నిన్న ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 20 మంది చనిపోయారు. క్లాసుకు హాజరైన విద్యార్థుల్లో కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు పైనుంచి కిందపడి మృతి చెందారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భవనం పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా కేవలం మేడపై షెడ్డువేసి సెంటర్‌ నిర్వహిస్తున్నారని గుర్తించారు. దీంతో భవన యజమానులు హర్షల్‌ వకారియా, జిగ్నేష్‌తోపాటు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు భార్గవ్‌ భూటానీలపై కేసు నమోదు చేశారు. అనంతరం భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరగగా, ఆ సమయానికి 50 మంది విద్యార్థులు క్లాసులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.