అసాంజేపై అమెరికా న్యాయశాఖ తొలి అభియోగం నమోదు

SMTV Desk 2019-05-25 15:53:53  Assange charged for role in WikiLeaks disclosures, Julian Assange

వాషింగ్టన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపక సంపాదకుడు జులియన్‌ అసాంజే భారీస్థాయిలో రహస్య సమాచారాన్ని బయటకు పంపించాడంటూ అతనిపై అమెరికా న్యాయశాఖ తొలి అభియోగాన్ని నమోదుచేసింది. అసాంజే సూచనల మేరకు ఆర్మీ ఇంటెలిజెన్స్‌ విశ్లేషకుడు చెల్సియా మానింగ్‌ ఈ రహస్య సమాచారాన్ని దొంగిలించారని ఆ అభియోగపత్రంలో పేర్కొంది. అయితే ఈ చర్య ద్వారా అమెరికా జాతీయ భద్రతకు గండికొట్టారని, ఈ దేశ నిఘా చట్టాలను అసాంజే అతిక్రమించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. కాని అసాంజే చర్యలను సాధారణ జర్నలిస్టుల విధి విధానాల నుండి ఏ విధంగా వేరు చేసి చూస్తారన్న ప్రశ్న అమెరికన్‌ మీడియా వర్గాలలో వ్యక్తమవుతోంది. గతంలో ఒబామా హయాంలో సైతం ఇదే విధమైన సందేహాలు తలెత్తటంతో అప్పట్లో అభియోగాల నమోదు ప్రక్రియను పక్కన పెట్టారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేయాల్సిన విధి జర్నలిస్టులందరిపైనా వుంటుందని, తన క్లయింట్‌ కూడా ఇదే చేసినప్పటికీ ఆయనపై అవాంఛనీయమైన అభియోగాలు మోపుతున్నారని అసాంజే తరపు న్యాయవాది బారీ పొలాక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మీడియా స్వేచ్ఛకు గండి కొట్టటమేనని ది రిపోర్టర్స్‌ కమిటీ ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ది ప్రెస్‌ విమర్శించింది. వాస్తవిక సమాచారాన్ని ప్రజలకు వెల్లడించినందుకు ఒక జర్నలిస్టుపై అభియోగాలు నమోదు చేయటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని అమెరికా పౌరహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే అసాంజే చర్యలేవీ చట్టబద్ధమైనవి కావని, వాటికి చట్టపరంగా రక్షణ లభించదని అమెరికా న్యాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జులియన్‌ అసాంజే అసలు జర్నలిస్టే కాదని అమెరికా అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ జాన్‌ డెమర్స్‌ చెబుతున్నారు. ప్రభుత్వం అత్యంత రహస్యమైనదిగా వర్గీకరించిన సమాచారాన్ని బాధ్యత కలిగిన ఏ వ్యక్తి లేదా జర్నలిస్టూ స్వప్రయోజనాల కోసం బహిర్గతం చేసి ప్రమాదాలను ఆహ్వానించబోరని ఆయన స్పష్టం చేశారు. వికీలీక్స్‌ కోసం అసాంజే చేపట్టిన చర్యలకు సాధారణ జర్నలిస్టుల విధి నిర్వహణకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం వుందని ప్రాసిక్యూటర్లు తమ అభియోగపత్రంలో న్యాయశాఖను కోరారు.ఈ సమాచార వెల్లడి వల్ల కేవలం అమెరికా ప్రభుత్వానికి మాత్రమే కాక అందులో పనిచేసిన వారికి కూడా ముప్పు పొంచివుందని వారు చెబుతున్నారు. 2012 నుండి లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయంలో వున్న అసాంజేను ఈక్వెడార్‌ ప్రభుత్వం గత నెలలో గెంటి వేసిన విషయం తెలిసిందే. తనను అమెరికాకు అప్పగించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తానని అసాంజే అప్పట్లోనే స్పష్టం చేశారు.