రవి ప్రకాష్ కోసం పోలీసులు గాలింపు

SMTV Desk 2019-05-25 15:38:50  Ravi Prakash,

టీవీ9 సంస్థ వాటాలకు సంబంధించిన వివాదంలో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం సైబరాబాద్‌ పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. ఆయన కోసం విస్తృతంగా వేటాడుతున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 21న పోలీసులు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 23లోగా సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో హాజరై వివరణ ఇవ్వాలని తెలిపారు.

అయితే రవిప్రకాశ్‌ ఆ నోటీసుకు ఏమాత్రం స్పందించకపోగా.. ఇప్పటికే రెండు దఫాలుగా 160 సీఆర్పీసీ, మరో రెండు దఫాలుగా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని పోలీసులు వెల్లడిస్తున్నారు. కాగా తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ ఆయన వీడియో రిలీజ్ చేయడాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. 41 ఏ సీఆర్పీసీ నోటీసుకు స్పందించకపోతే నేరుగా అరెస్ట్‌ చేసే వెసులుబాటు ఉండటంతో రవిప్రకాశ్‌ను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా రవిప్రకాశ్‌ ఇన్ని రోజులు ఏపీలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారడంతో పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి గాలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.