లోక్‌సభలో అడుగుపెట్టనున్న 78 మంది మహిళలు!

SMTV Desk 2019-05-25 15:34:14  smriti irani

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. ఈసారి రికార్డు స్థాయిలో 78 మంది మహిళలు విజయం సాధించి పార్లమెంటులో తమ వాణి వినిపించేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 724 మంది మహిళలు పోటీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 78 మంది ఎన్నికై రికార్డులకెక్కారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి 11 మంది చొప్పున విజయం సాధించడం విశేషం.

ఈ ఎన్నికల్లో 41 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో నిలవగా వారిలో 27 మంది విజయం సాధించారు. వీరిలో చాలామంది మహిళలు హేమాహేమీలను మట్టికరిపించడం మరో విశేషం. భోపాల్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ ఓడించగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓడించారు.

16వ లోక్‌సభలో 64 మంది మహిళల ప్రాతినిధ్యం ఉండగా, ఈసారి అది 78కి చేరుకుంది. ఈ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ 54 స్థానాలను మహిళలకు కేటాయించగా, బీజేపీ 53 స్థానాల్లో మహిళలను బరిలోకి దింపింది. 78 మంది మహిళలతో కొత్త లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం 14 శాతానికిపైగా పెరిగింది.