భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆస్ట్రేలియా రాయబారి

SMTV Desk 2019-05-24 18:02:01  evms india, australia brand ambassador

భారత్ లో ఈవీఎంలపై కొంతకాలంగా వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ హరీందర్ సిద్ధూ ఈవీఎంల వినియోగంపై స్పందించారు. భారత్ లో ఈవీఎంలతో ఓటింగ్ ఎంతో బాగుందని, ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఈవీఎంలు లేవని అన్నారు. అక్కడ ఎంతోకాలంగా పేపర్ బ్యాలెట్లతోనే ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని హరీందర్ సిద్ధూ చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నికల్లో ఏ వ్యవస్థ ఉపయోగించినా సమస్యలనేవి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్ లో ఈవీఎంలకు తోడుగా వీవీ ప్యాట్లు ఉపయోగించడం భేషైన చర్య అని కితాబిచ్చారు. మొత్తమ్మీద భారత్ లో ఈవీఎంల వినియోగం పట్ల తాను ఎంతో సంతృప్తి చెందుతున్నానని ఆమె స్పష్టం చేశారు. భారత్ వంటి విశాల దేశంలో ఎంతో మంది ఓటర్లతో పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించగలుగుతున్నారంటే అందుకు కారణం ఈసీ, దాని సిబ్బంది అని హరీందర్ సిద్ధూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, భారత సంతతికి చెందిన హరీందర్ సిద్ధూ గతంలో ఆస్ట్రేలియా రాయబారిగా సిరియా, రష్యా, ఈజిప్టు దేశాల్లోనూ పనిచేశారు. 2016లో ఆమె భారత్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ గా నియమితులయ్యారు.