వేదికపై 'ముసలి రైతు' మాటలకు భావోద్వేగానికి గురైన మహేశ్

SMTV Desk 2019-05-24 16:48:57  mharshi, pooja hegde, vamsi paidipalli

మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్ ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. రైతులు, వ్యవసాయం ఇతివృత్తంగా తెరకెక్కించిన మహర్షి చిత్రంలో ముసలి రైతు పాత్ర పోషించిన గురుస్వామి అనే నాటకరంగ కళాకారుడు కూడా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. వేదికపై కళ్లు చెమర్చేలా సాగిన ఆయన ప్రసంగం విని హీరో మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కదిలిపోయారు.

ఓ దశలో వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఊహించని విధంగా తాను సినిమాల్లోకి వచ్చానని, తనకు కెమెరా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదని గురుస్వామి అన్నారు. రవి అనే ఆయన తనకు ఎలా చేయాలో చెప్పారని గుర్తుచేసుకున్నారు.తన తండ్రి ఓ కూలీ అని, ఆయన కష్టార్జితంతో తాను కూడా ఎంతో శ్రమించి పైకెదిగి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించానని తెలిపారు. అయితే, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, ఇంటికొస్తే ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయపడి నాటకాల వైపు మళ్లానని, ఆ విధంగా బాధలు మర్చిపోయేవాడ్నని చెప్పడంతో మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి చలించిపోయారు.

కర్నూలులో స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉన్న తాను ఇటీవలే ఓ షార్ట్ ఫిలింలో నటించడంతో, ఆ ఫిలిం చూసి వంశీ అవకాశం ఇచ్చారని గురుస్వామి వెల్లడించారు. మహేశ్ బాబు పెద్ద నటుడు అని పిల్లలు చెప్పుకుంటుంటారని, అలాంటి వ్యక్తి ఎదుట నిలబడి కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ నటించడం తన జీవితానికి దక్కిన వరంగా భావిస్తానని, ధన్యవాదాలు సార్ అంటూ చెప్పడంతో మహేశ్ బాబు పైకి లేచి వచ్చి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. పలుమార్లు ఆయన గురుస్వామికి చేతులెత్తి నమస్కరించారు.