బ్రేకింగ్: ప్రేమ, పెళ్లి యువజంట ఆత్మహత్య

SMTV Desk 2019-05-24 16:05:47  dawaleshwaram, lovers suicide, rajamahendravaram

పరీక్షల సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారింది. పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వివాహ జీవితంలో ఎదురైన కష్టాలను ఎదురీదలేక ఆత్మహత్యే శరణ్యమనుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

ధవళేశ్వరం పరిధిలోని కొత్తపేటకు చెందిన జగదీష్‌కు రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ ప్రాంతానికి చెందిన దీప్తికి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహానికి ఇరుపక్షాల పెద్దలు అంగీకరించక పోవడంతో ఆరు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు.

కొత్తపేటలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. పెళ్లి తరువాత జగదీష్‌ రెండు నెలలు బట్టల షాపులో పనిచేసి మానేశాడు. జగదీష్‌ సోదరుడు వెంకటేష్‌ అప్పుడప్పుడూ కొంత ఆర్థిక సహాయం అందించేవాడు. అదీ సరిపోక చాలామంది స్నేహితుల దగ్గర అప్పు చేశాడు.

రెండు రోజుల కిందట జగదీష్‌ తన సోదరుడికి ఫోన్‌ చేసి కొంత డబ్బులు కావాలని అడిగారు. అయితే ఆయన సర్దుబాటు చేయలేకపోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో విషం తాగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిద్దరు ఇంటినుంచి బయటకు రాకపోవడం గమనించిన ఇంటి యజమాని శనివారం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన సీఐ బాలశౌరి సిబ్బందితో తలుపులు తెరిపించి చూడగా లోపల విగతజీవులుగా పడిఉన్నారు. శవ పంచనామాకోసం మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నో ఆశలతో ప్రేమవివాహం చేసుకున్న యువజంట ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.