తప్పిన ఘోర ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ 23 మంది

SMTV Desk 2019-05-24 16:04:01  telugu states, crime, hyderabad, karimnagar

తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడుతున్నాయి. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణకు చెందిన 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరో ఘోర ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.

హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్‌ మండలం నుస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బస్సు పరిమిత వేగంతో వస్తున్నందునే ప్రమాద తీవ్రత తగ్గిందని, ఓవర్ స్పీడ్‌లో వస్తే ఘోర ప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.