2,850 మంది పోలీసులతో IPL ఫైనల్ మ్యాచ్

SMTV Desk 2019-05-24 15:43:31  IPL final match, CSK, mumbai,

హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సీపీ మహేష్ భగవత్. శనివారం విలేకరులతో మాట్లాడిన సీపీ.. ఫైనల్‌ మ్యాచ్‌ సందర్బంగా స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. పర్యవేక్షిస్తామని, ఇందుకోసం స్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,850 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు. హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్, మద్యం, తినే ఆహార పదార్థాలతోపాటు బయటినుంచి తీసుకొచ్చే వాటర్‌ బాటిళ్లను సైతం లోపలికి అనుమతించమని తెలిపారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, అన్ని ప్రవేశద్వారాల వద్ద చెకింగ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు.

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరగనుంది.